మజ్లిస్ రిగ్గింగ్ చేసింది... అవసరమైతే ఎంత దూరమైనా వెళతా: హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత

 హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో రిగ్గింగ్ జరిగిందని... ఈ రిగ్గింగ్‌పై అవసరమైతే తాను ఎంత దూరమైనా వెళతానని ఈ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మాధవీలత అన్నారు. 16 ఏళ్ల బాలిక రెండుసారి ఓటు వేసేందుకు వచ్చి దొరికిపోయిందన్నారు. పాతబస్తీలో భారీగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు.


ఈ రిగ్గింగ్ ఆపేందుకు తాను వెళితే తనపై దాడికి యత్నించారన్నారు. ఆ పక్కనే పోలీసులు ఉన్నా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మజ్లిస్ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్నారు. ఒక ఓటు వేయడానికి కాస్త సమయం తీసుకుంటుందని... కానీ చివరలో ఓటింగ్ శాతం ఎలా పెరిగింది? అని ప్రశ్నించారు.

ఎన్నికల రోజున మతతత్వాన్ని ఎవరు తీసుకువచ్చారని ప్రశ్నించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎంఐఎం నినాదాలు చేయడం ఎంత వరకు న్యాయమన్నారు. హైదరాబాద్ నియోజకవర్గంలో మజ్లిస్ గెలవదన్నారు. వారు రిగ్గింగ్ చేశారని... అవసరమైతే రీపోలింగ్ పెట్టించుకుంటామన్నారు. న్యాయం, నిజాయితీ, ధర్మం తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Post a Comment

Previous Post Next Post